సంబంధం లేని ఉపయోగం లేని రాతలు

"ఏమిరాయాలి అనే ఆలోచనకి.... ఆ ఆలోచన నుండి అనాలోచితంగా ఒక అక్షరం మొదలు పెట్టి పేజీల పేజీలు  రాయడానికి  మధ్యన సమయం గంజాయి కన్నా ఎక్కువ కిక్కు ఇస్తుంది నాకు. "
ఆ కిక్కుని మాటల రూపంలో చెప్పేలోపే ఏమి రాయాలనుకున్నానో అది గాలిలో కలిసిపోయింది.  

గంటసేపు నుండి ఆలోచించడానికి సరిపోయింది ఎందుకో ఒకోసారి ఏమీతోచక రాయలేము, ఒకోసారి అన్నీ ఒకేసారి తోచేసరికి ఏమీ రాయలేము.  

ఈ గంటలో మొదటి 10 నిమిషాలు టీ పెట్టుకొని దాన్ని సేవించడానికి సరిపోయింది. టీ ఎప్పుడూ సహాయపడుతుంది, మరి అది నా బుర్రలోకి వెళ్ళి ఏ నరానికి పడ్డ ఏ మెలిక సరి చేస్తుందో తెలియదు కానీ.
 

టీ సేవిస్తూ మా ఇంటి కిటికీ నుండి కనిపించే, గత ఆరు నెలలుగా ఎండిపోయిన పుల్లలతో, ఎప్పుడూ ఉడతలు అప్పుడప్పుడు పక్షులు వాలే చెట్టుని, ఆ పుల్లల వెనుక రోజుకో రంగుతో అస్తమించే సూర్యుడ్ని చూస్తూ ఉండటం రెండో మెట్టు, రాయటానికి నన్ను నేను సన్నద్ధం చేసుకోవడంలో. 


మా ఇంటి కిటికీ నుండి. ఇదే గదుల్లో బంధీ అయిన నా మెదడుకి స్వర్గ ద్వారం.  

మూడో భాగం పెద్దగా శ్రమించవసరం లేకుండా, టీ తో హుషారెక్కిన మెదడు,  సప్తవర్ణాలతో  అస్తమించన సూర్యుని ద్వారా ఆహ్లాద పడ్డ మనసు, రెండు కలిపి, రాసే చేతిని, చేతి ద్వారా రాయించే కేంద్రాన్ని, ఎం. స్. సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం గీతం ఉదయాన్నే సుకుమారంగా నిద్రలేపినట్టు లేపాయి. 

వీటన్నిటి తర్వాత ఆలోచనల ధాటి తట్టుకొని అందులోనుండి ఓక విషయాన్ని ఎంచుకొని, దానికి కావలసిన అవగాహన, నాకు తెలిసిన స్వీయానుభవాలు, లేదా రీసెర్చ్ చేసి రాయగలిగే సమయం, ఇవన్నీ ఉన్నాయా, ఉన్నాకూడా అవి నేను చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతుంది, ఉండి చెప్పినా అసలు ఎంత మంది చదువుతారు? అనే ఆలోచనలు కమ్ముకున్నాయి. 

వీటిల్లో ఏదైనా ఒక్క దాని గురించి రాయాలనుకొని మొదలుపెట్టి ..... మీకే తెలుసు ఎక్కడ ముగించానో. 

అసలు ఇదంతా కాదు తెలుగు చదివే వాళ్ళు ఉన్నారా? వెంటనే  మన తెలుగు జనాభా ఎంతుందా  అని గూగుల్ చేయటం, అబ్బో ఇంతమందా అని మొదట ఆశ్చర్యపోయి ఆనందందపడ్డా, ఇందులో ఎంత మందికి ఇంటర్నెట్ ఉంది, చదివే తీరిక ఓపిక ఉంది, ఉన్న వాళ్లలో ఎంతమంది ఈ వెధవ బుర్రలో పుట్టిన ఒక ఆలోచనని చదివి దానితో  వాళ్ళని  relate చేసుకోగలరు? చేసుకున్నా ఎంతసేపు వాళ్ళ మెదడులో, హృదయంలో దాన్ని నిలుపగలను? పోనీ నిలిపానే అనుకుందాం, నేనేమన్నా శ్రీ శ్రీ గారిలా విప్లవ సాహిత్యం చేసానా?, చలం గారిలా స్త్రీ స్వేచ్ఛ గురించి రాసానా?, లేక నాదేమన్నా గాంధి, అంబేద్కర్ లాంటి వారి ఆత్మకథా, లేక పోరాట యోధుని కథా, లోకాన్ని పోరాడి గెలిచినా యువతి గాథా ? ఇవేవి కాదు కదా ఒక పనికిమాలిన యూట్యూబ్ బి గ్రేడ్ headline కూడా కాదు. 

అయినా కూడా ఈ భారం ఏంటో, రాయాలి రాయాలి అనే అందమైన ఆరాటం, తపన. కొద్దిరోజులు నిలుపగలను రాయకుండా, కానీ మళ్ళీ నాలోనే ఉండి నాతోనే పోరాడి, నా చేత రాయించే, అదేంటో తెలియక, నన్ను నేను ఇలా laptop ముందు భారంగా లాక్కొచ్చి పడేసి, ఇళయరాజా గారి పాటలతో, ఆ రాయాలనే దారీ తెన్నూ లేని, నయాగరా జలపాతంలా దూకే మాటల దూకుడికి కళ్లెం వేసి, ఏదేదో చెప్పబోయి, కాదు కాదు మనోభావాలు, వగైరాలు దెబ్బతింటాయని, ఏదేదో చెప్పి మొత్తానికి ఏదో చెప్పేశా అని నా ఆ ఆరాటాన్ని, తపనని కొద్దిరోజులు నన్ను బాధించకుండా చేస్తుంటాను. 

అరె రే.... ఇప్పుడే ఒకసారి మొదటినుండి చదివా, సత్యంగా అసలు ఇది మాత్రం కాదు చెప్పాలనుకున్నది. అసలు ఒక  పేరా కి మరో పేరాకి సంబంధమే లేకుండా ఉందే! హు! చెరపాలని లేదు. చదివేయండి ఈసారికి ఇలా, ఏమో ఎవరికీ తెలుసు, పిచ్చి గీతాలు కూడా ఎవరోఒకరి అద్భుతమైన గీతలలో, రాతలతో, కలిసిపోవచ్చేమో. నా లాంటి వారే ఉండచ్చేమో. 

లేకపోయినా ఇంకొక టపాకి ధైర్యంగా వచ్చి చదువుతారని నమ్మకం. ఎందుకంటే మనం తెలుగు వారం. మనకి ఉన్నాయి ఓర్పు సహనం.   

చిందర వందర మనసునుండి వచ్చిన సంబంధం లేని మాటలతో సమయం వృధా చేశా అని తిట్టుకోకుండా చదివినందుకు (తిట్టుకున్నా పర్వాలేదు లేండి) కృతజ్ఞతలు.  


Popular Posts